మా ఊరు చింతలపూడిలో బొగ్గునిక్షేపాలు - మరో సింగరేణి కేంద్రంగా మారనున్న చింతలపూడి ప్రాంతం

సూర్య దినపత్రికలో

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : రాష్ట్ర విభజనలో సింగరేణి బొగ్గును కోల్పో యామని, ఫలితంగా విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోందని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆ సమస్య నుండి ఊరట కలుగనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం పరిధిలో సింగరేణి కన్నా మేలైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయనే విషయం ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) గుర్తించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తెలియచేసి నట్లు సమాచారం. దీనికితగినట్లుగా పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో జి గ్రేడ్‌కు చెందిన నాణ్యమైన బొగ్గు నిల్వలు భారీగా ఉన్నాయని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జిఎస్‌ఐ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసినట్లు తెలియవచ్చింది. 

ఈ నివేదికపై సీఎం చంద్రబాబునాయుడు గురువారం సంబంధిత ఉన్నత స్థాయి అధికార్లతో సమీక్ష కూడా నిర్వహించినట్లు వెల్లడవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గోదావరీ నదీ పరీవాహక ప్రాంతంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించిన చింత లపూడి సబ్‌ బేసిన్‌లో ఉన్న గోండ్వానా బొగ్గు నిల్వల వివరాలను అధికారులు సీఎం ముందుంచారు. ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు నిక్షేపాలు బయటపడడంపై సీఎం ఈ సమావేశంలో హర్షం వ్యక్తంచే శారు. పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి ఉప బేసిన్‌ పరిధిలో రాచర్ల-నర్సాపురం, వడ్లగూడెం, సీతానగరం, నారాయణపురం-పట్టాయగూడెం, పూతనసముద్రం-వెంకటాపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, తడికలపూడి బ్లాకుల్లో మేలైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సీఎంకు సమర్పించిన నివేదికల్లో వెల్లడించినట్లు సమాచారం. అలాగే కృష్ణా జిల్లాలోని సోమవరం బ్లాక్‌లో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది.

కోల్‌ మైన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులతో చర్చించి బొగ్గు వెలికితీతపై తక్షణం ప్రణాళికలను రూపొందించాలని ఈ సమావేశంలో ఏపీఎండీసీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 
ప్రధానంగా దేశ విద్యుత్‌ అవసరాల్లో సగం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలే తీరుస్తున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి వేగంగా జరగాలంటే పరిశ్రమలకు ఆటంకం లేకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా అవసరం కావాల్సి ఉంటుంది. ఎక్కడైనా కొత్త చోట పరిశ్రమలు స్థాపించాలనుకున్నప్పుడు పారిశ్రామిక వేత్తలు ప్రధమంగా ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా ఎలా ఉందనే విషయాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఈ క్రమంలో చింతలపూడి బొగ్గు గనులు కనుక వినియోగంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధిలో వేగంగా దూసుకుపోయే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సింగరేణి బోగ్గుపై ఆధారపడిన సీమాంధ్రలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు రాష్ట్ర విభజనలో అది తెలంగాణ రాష్ట్రానికి చెందడంతో పెద్ద సమస్యగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బొగ్గుతో నడిచే థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుల్లో విటిపీఎస్‌, ఆర్‌టిపిపి ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఏటా 19,278.83 మిలియన్‌ యూనిట్లుగా అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. హైడల్‌, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులతో నిరంతరాయంగా కొంతకాలం విద్యుత్‌ను సరఫరా చేసే అవకాశం ఉన్నా విభజన జరిగిన రెండేళ్ల తర్వాత అసలు సమస్యలు మొదలవుతాయని ఇప్పటికే అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కోస్తాలో గ్యాస్‌ నిక్షేపాలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే గ్యాస్‌ ధర విపరీతంగా పెంచిన రిలయన్స్‌ రానున్న రోజుల్లో దీన్ని మరింత పెంచే వీలుందనేది ఇప్పటికే అధికార్ల దృష్టిలో ఉన్న అంశం. గ్యాస్‌ కొరతను తీర్చేందుకు ఎక్కువ ధర పెట్టే పరిస్థితి లేకపోవడం వల్ల గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ఏర్పడనుంది.

దీంతోపాటు సీమాంధ్రలో బొగ్గు లేకపోవడంతో దాన్ని తెలంగాణ, ఒడిషా తదితర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో వచ్చే నాలుగేళ్లలో సీమాంధ్రలో కూడా విద్యుత్‌ కొరత ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో భవిష్యత్‌లో ఆ రాష్ట్రానికి విద్యుత్‌ సమస్య ఉండదనేది అధికారవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

1 Comments

  1. Great News! It will bring both royalty as well as self-reliance for AP.

    ReplyDelete
Previous Post Next Post