ఆ తూనీగను చంపింది నేనా?



ఆ తూనీగను చంపింది నేనా?
వృత్తిరీత్యా నేనొక టీచర్‌ను అని మీకు తెలుసు కదా. . ఈ రోజు టెట్‌ కోచింగ్‌లో క్లాసులో ఉన్న సమయంలో ఒక చిత్రం జరిగింది. క్లాసు రూములో ఒక మూల సాలెగూడులో చిక్కుకున్న తూనీగ ఒకటి నా కంట పడినది. వెంటనే నేను గొప్ప సంఘసంస్కర్తలా ఆ తూనీగను గూడు నుంచి తప్పించాను. వెంటనే తూనీగ తుర్రుమంటూ ఎగిరి అక్కడ వెలుగుతున్న లైటు చుట్టూ తిరుగుతోంది. నేను క్లాస్‌ చెప్తూనే ఒక కంట దాన్ని గమనిస్తున్నాను. అలా తిరుగుతూ అది వాలిన ప్రతిసారీ అక్కడే ఉన్న బల్లి దాన్ని తిందామని అదనుకోసం ఎదురుచూస్తోంది. నాకేమో భయంగా ఉంది. ఎక్కడ బల్లి తూనీగను చంపి తినేస్తుందో అని. అనుకున్నంత అయినది. ఆ తూనీగను చంపి తినాలని రెక్కను బల్లి పట్టుకుంది. కానీ తూనీగ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా రెక్క తెగి అది కాస్తా నేలమీద పడిపోయింది. ఇంతలోనే చిత్రంగా ఒక ఊహించని పరిణామం. ఎటునుంచి వచ్చినదో ఒక కప్ప వచ్చి ఆ తూనీగను గుటుక్కున మింగేసింది. నాకు ఆశ్చర్యం . . బాధ ఒకేసారి కలిగాయి. జస్ట్‌ కొద్దినిమిషాలలోనే సాలీడుకు ఆహారం కావలసిన తూనీగ ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ ఆశ్చర్యకరరీతిలో కప్పకు ఆహారం అయినది. ఒక్కసారిగా నాకు అనిపించింది. సాలెగూటిలో ఉన్న తూనీగను అలా వదిలేస్తేనే బ్రతికేదేమో అని
మీరు చెప్పండి. ఆ తూనీగను చంపింది నేనేనా?
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

నా అంతరంగం (లోప‌లికి తొంగి చూడ‌కండి). . .

Post a Comment

Previous Post Next Post