2025 న‌వంబ‌ర్ 14 నాటి ప్ర‌ముఖ దిన‌పత్రిక‌ల‌లో ప్ర‌చురిత‌మ‌వ‌బోయే వార్త . . .

2025 న‌వంబ‌ర్ 14 నాటి ప్ర‌ముఖ దిన‌పత్రిక‌ల‌లో ప్ర‌చురిత‌మ‌వ‌బోయే వార్త . . .
బ‌య‌ల్ప‌డిన ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆన‌వాళ్లు
ఈనాడు, చింత‌ల‌పూడి, మంగ‌ళ‌వారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడిలో బొగ్గు అన్వేష‌ణ‌కై జ‌రిపిన త‌వ్వ‌కాల‌లో ప్రాచీన పాఠ‌శాల‌ల ఆన‌వాళ్లు బ‌య‌ల్ప‌డ్డాయి. స్థానిక స్టేట్‌బ్యాంకు స‌మీపంలో జ‌రిపిన ఈ తవ్వ‌కాల‌లో ఒక చెక్క‌పై న‌లుపు రంగు పూసిన ఆన‌వాళ్లు, తెల్ల‌ని స్థూపాకారంలో చేతిలో ఇమిడే ప‌రిమాణంలో ఉండే వింత వ‌స్తువులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇంకా బైండు పుస్త‌కంలో ఎవ‌రివో పేర్లు రాసి ఉన్న పుస్త‌కం, ఆ పేర్ల‌కు ఎదురుగా X గుర్తు రాసి ఉన్న పుస్త‌కాలు, గాజు ప‌రీక్ష‌నాళిక‌లు కూడా క‌నిపించ‌డం విశేషం. ఈ విష‌య‌మై గ‌త ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా జీవించి యున్న వృద్ధుల‌ను ప్ర‌శ్నించ‌గా, త‌మ చిన్న‌త‌నంలో అంటూ . . ఙ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు. ఓ ముస‌లాయ‌న అరుంధ‌తిలో జేజెమ్మ చ‌రిత్ర‌ను గురించి ముస‌ల‌మ్మ చెప్పిన‌ట్లు ఇలా చెప్పాడు . . .
అది 2010 తొలినాళ్లు. అప‌ట్లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు పేరుతో త‌ర‌గ‌తి గ‌దులుండేవి. వాటిలో ఉపాధ్యాయుల‌నే వృత్తిని స్వీక‌రించిన వారు కొంద‌రు, పుస్తకాల‌లో ఉన్న విష‌యాల‌ను పిల్ల‌కాయ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా చెప్పేవాళ్లు. పిల్ల‌లు కూడా ఇంగ్లీసు మాట్లాడుతూ, ఎప్పుడూ చ‌దువు, ప్ర‌యోగాలంటూ తిరిగేవాళ్లు. చ‌దువుల‌లో మార్కులు ఉండేవి. 500 మార్కులు వ‌చ్చిన పిల్ల‌లంటే అంద‌రికీ ఇష్టం ఉండేది. క్ర‌మంగా మార్పులు రానారంభించాయి. క్ర‌మంగా ఉపాధ్యాయుల‌ను పాల‌కులు హింసించ‌డం మొద‌లెట్టారు. ఆ విధానం, ఈ విధానం అంటూ ప్ర‌యోగాలు చేస్తూ ఎలుక‌ల‌మీద ప్ర‌యోగాలు చేసిన‌ట్లు, ఉపాధ్యాయుల‌పై ప్ర‌యోగాలు చేసేవారు. ఆ ప్ర‌యోగాలలో విసిగి వేసారిన ఉపాధ్యాయులు, చివ‌రికి తాము ఎంచుకున్న వృత్తికి న్యాయం చేయ‌లేక‌, అలా అని ఆ వృత్తిని వ‌దిలేయ‌లేక చాలా ఇబ్బందులు ప‌డేవారు. హ‌ఠాత్తుగా 2014లో అనుకుంటా . . . అదేదో సీసీయో, కేసీయో . . .ఏదో కొత్త ప‌ద్ధ‌తంటా . . మొద‌లుపెట్టేస‌రికి ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోయారు. విద్యార్ధుల‌కు కూడా పిచ్చివారిలా తిరుగుతూ, చిత్తుకాయితాలు ఏరుకుంటూ వాటిపై క‌నిపించిన ప్ర‌తి చిత్రాన్ని ప్రోజెక్టుల‌నుకుంటూ చింపుకోవ‌డం, అతికించ‌డం మొద‌లెట్టారు. ఐదారు స‌బ్జ‌క్టుల‌నుకుంటా ఒకేసారి ప్రాజెక్టులు ఇచ్చేస్తుంటే పిల్ల‌లు ఒక‌టే గోల చేసేవారు. క్ర‌మంగా ఆ ప్రాంతం మొత్తం ఉపాధ్యాయులు, విద్యార్ధుల హాహాకారాల‌తో మార్మోగిపోయింది. ఆ సంద‌ర్భంలోనే ఒక విష‌యం జ‌రిగింది.. . ఈ పాఠ‌శాల‌ల వినాశ‌న‌మే ఎప్ప‌టినుంచో కోరుకుంటున్న పాల‌క వ‌ర్గం ఉపాధ్యాయుల‌పై మ‌రిన్ని ఒత్తిడిల‌ను తెచ్చేసి, ఈ విద్యావ్యవ‌స్థ‌, విధానం మాకొద్దంటూ బహిరంగంగా ప్ర‌క‌టించేలా చేశారు. ఆపై ఈ ఆన‌వాళ్లు మిగిలినా మ‌ళ్లీ ఏదో ఒక‌నాడు ఉపాధ్యాయవృత్తిపై మిగిలి ఉన్న ఒక‌రో ఇద్ద‌రో మ‌ళ్లీ పాఠ‌శాల‌లంటూ ఉద్య‌మిస్తార‌ని త‌లంచిన ప్ర‌భుత్వం, ఎవ‌రూ చేయ‌ని ఒక పాపానికి ఒడిగ‌ట్టింది. 2019 అంద‌రూ ఎన్నిక‌ల హడావుడిలో ఉన్న స‌మ‌యంలో ఒక ఆదివారం తెల్ల‌వారుజామున ప్ర‌భుత్వం ప్రొక్లెయిన‌ర్‌ల‌నే యంత్రాల‌తో విరుచుకుబ‌డింది. క‌నిపించిన పాఠ‌శాల‌నల్లా కూల్చివేసింది. న‌ల్ల‌బ‌ల్ల‌లు, ప్ర‌యోగ‌శాల‌లు, గ్రంధాల‌యాలు ఒక్క‌టేమిటి స‌మ‌స్తం ఆ యంత్రాల‌కు ఎదురు చెప్ప‌లేక శిధిలాల క్రింద‌ప‌డి ఎవ‌రు గుర్తించ‌లేని విధంగా త‌యార‌య్యాయి. కొద్ది రోజుల‌కు అక్క‌డ అడ‌వుల‌ను పెంచాలంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చిన ప్ర‌భుత్వం చెట్టు నాటే పనివ‌ల్ల ఇక పాఠ‌శాల‌లు అనే వ్య‌వ‌స్థ ఉందనే విష‌యమే త‌రువాత త‌రాల వారికి తెలియ‌కుండా పోయింది . అంటూ చింత‌ల‌పూడికి చెందిన వృద్ధుడు ర‌మ‌ణ‌య్య త‌న బాల్య‌పు అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకున్నాడు.




స‌ర‌దాగా . . .
మీ
చైత‌న్య కుమార్ స‌త్య‌వాడ‌

నా అంత‌రంగం (తొంగి చూడ‌కండి) . . .

1 Comments

Previous Post Next Post