HOW TO PREPARE FOR DEE CET? DEE CET కు ఎలా ప్రిపేర్ కావాలి?

DEE CET కు ఎలా ప్రిపేర్ కావాలి?

సాధార‌ణంగా ఇంట‌ర్ పూర్తి చేసుకున్న విద్యార్ధినీ విద్యార్ధులు, రెండు ల‌క్ష్యాల‌వైపుగా విభ‌జించ‌బ‌డ‌తారు. ఎంసెట్ ద్వారా ఇంజ‌నీరింగ్‌వైపుకు కొంద‌రు విద్యార్ధులు న‌డ‌క‌ను ప్రారంభిస్తే, మ‌రికొంద‌రు విద్యార్ధులు డీసెట్ రాయ‌డం ద్వారా టీచ‌ర్‌ట్రైనింగ్ పూర్తిచేసుకుని ఆపై ఉపాధ్యాయ వృత్తిలో స్థిర‌ప‌డాల‌నుకుంటుంటారు. పూర్వ‌కాలంలో బ‌త‌క‌లేక బ‌డిపంతులు అనేవారు కానీ ప్ర‌స్తుతం బ‌త‌క‌నేర్చిన బ‌డిపంతులు అంటున్నారు. ఎందుకంటే గ‌త పిఆర్‌సిల పుణ్య‌మాని ఉపాధ్యాయుల జీతాలు రెట్టింపు, మూడు రెట్లువర‌కూ అయ్యి చ‌క్క‌ని స్తాయిని చేరుకున్నాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే సొంతూరులో ఉంటూ, చ‌క్క‌ని సంపాద‌న‌ను ఆర్జించే అవ‌కాశం ఒక్క ఉపాధ్యాయ‌వృత్తిలో త‌ప్ప ఇత‌ర ఏ వృత్తిలోనూ అవ‌కాశం లేద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తిలేదు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు అయితే ఎటువంటి ఒత్తిడులు, ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయే ఉద్యోగం ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగ‌మే. మ‌రి అటువంటి ఉద్యోగానికి పోటీకూడా ఎక్కువ‌గా ఉండ‌డం స‌హ‌జ‌మే క‌దా. . .
ఉపాధ్యాయ వృత్తిలోకి రావాల‌నుకునేవారికి ఇంట‌ర్ త‌రువాత డీసెట్ ప‌రీక్ష‌, డిగ్రీ త‌రువాత ఎడ్‌సెట్ ప‌రీక్ష‌లు అవ‌కాశం క‌లిగిస్తున్నాయి. అయితే ఇటీవ‌ల బిఈడీ పూర్తి చేసుకున్న అభ్య‌ర్ధుల సంఖ్య పెరిగిపోవ‌డం, బిఎడ్‌వారు స్కూల్ అసిస్టెంట్ పోస్తుల‌కు మాత్ర‌మే అర్హులు అంటూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం, ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు త‌క్కువ సంఖ్య‌లో ఉండ‌డం వ‌ల‌న ఎడ్‌సెట్ ప‌రీక్ష‌కు డిమాండ్ త‌గ్గిపోయింది. ఇక డిఎడ్ కోర్సు విష‌యానికి వ‌స్తే ఇది ప్రాధ‌మిక పాఠ‌శాల‌లో ఉండే సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్స్ పోస్టుల‌కు సంబంధించిన‌ది. ఈ పోస్టుల భ‌ర్తీ స్కూల్ అసిస్టెంట్‌ల‌తో పోస్టుల‌తో పోల్చితే ఎక్కువ‌గా ఉండ‌డం, పోటీ త‌క్కువ‌గా ఉండ‌డంతో ఇటీవ‌ల డీసెట్ రాసి డిఎడ్‌లో చేరాల‌నుకుంటున్న విద్యార్ధుల సంఖ్య పెరిగిన‌ది. 
క‌నుక డీసెట్ ప‌రీక్ష‌కు పోటీ ఎక్కువ‌గానే ఉంటుద‌న్న విష‌యాన్ని ముందుగా గ‌మ‌నించాలి. అంతేకాక‌, ఇప్పుడు డీసెట్ ప‌రీక్ష‌కు ఏ సిల‌బ‌స్‌ను అయితే అభ్య‌ర్ధులు ప్రిపేర్ కావ‌ల‌సి ఉందో అదే సిల‌బ‌స్ కోర్సు అనంత‌రం డియ‌స్సీలో కూడా ప్రిపేర్ కావ‌ల‌సి ఉంది. క‌నుక దీర్ఘ‌కాలికదృష్టితో విద్యార్ధులు ఇంట‌ర్ పూర్తి చేసుకున్నాక‌, ఏదో క‌ళ‌శాలలో సీటుకోసం డీసెట్‌కు ప్రిపేర్ అవుతున్నామ‌న్న భావ‌న‌తో కాకుండా ఇదే ఉద్యోగానికి ప్రిప‌రేష‌న్ అని భావిస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చ‌క్క‌ని ప్ర‌ణాళికా బ‌ద్ద‌మైన ప్రిప‌రేష‌న్ ద్వారా ఇటు డీసెట్‌లోనూ, అటు డియ‌స్సీలోనూ విజ‌యం సాధించ‌వ‌చ్చు.
డీసెట్‌లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్ధుల‌కు ప్రభుత్వ డైట్‌లో ఉచిత సీటు ల‌భిస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 13, తెలంగాణాలో 10 డైట్ క‌ళ‌శాల‌లు నిర్వ‌హించ‌బ‌డుతున్నాయి. వీటిలో కేవ‌లం నామ‌మాత్ర‌పు ఫీజుల‌తో హాస్ట‌ల్ వ‌స‌తితో చ‌దువుకోవ‌చ్చు. ర్యాంక్‌లో కొద్దిగా వెనుక‌బ‌డితే ప్రైవేటు క‌ళ‌శాల‌లో కౌన్సిలింగ్‌కోటాలో సీటు సాధించే అవ‌కాశం ఉంది. అయితే ఈ సీటుకు చెల్లించాల్సిన ఫీజుకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సుమారు ప‌ది నుంచి ప‌దిహేను వేల‌వ‌ర‌కూ విద్యార్ధులు చెల్లించాల్సిరావ‌చ్చు. ఇక ఆ సీటుకు కూడా అర్హ‌త సాధించ‌ని ర్యాంకు మీదైతే యాజ‌మాన్య‌కోటాలో ల‌క్ష‌ల‌లో డ‌బ్బుపోసి సీటు కొనుక్కోవాల్సి ఉంటుంది. డీసెట్‌ప‌రీక్ష‌లోనే మంచి ర్యాంకు సాధించ‌లేనివారు డియ‌స్సీలో కూడా ర్యాంకు సాధించ‌లేక‌పోవచ్చు. డ‌బ్బుతో సీటు సాధించిన‌, ఉద్యోగం సాధించ‌లేమ‌న్న విష‌యాన్ని విద్యార్ధులు మ‌రువ‌కూడ‌దు. అందుకే డీసెట్ ప‌రీక్ష‌లో సీటు సాధ‌న‌తోపాటుగా మంచి ర్యాంకు సాధన కూడా ముఖ్య‌మేన‌న్న విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులు ప్రిపేర్ కావ‌ల‌సి ఉంటుంది.
డీసెట్ పోటీ ప‌రీక్ష విష‌యానికి వ‌స్తే ప‌రీక్ష 100 మార్కుల‌కు 100 ఆబ్జెక్టివ్ త‌ర‌హా ప్ర‌శ్న‌ల‌తో నిర్వ‌హించ‌బ‌డుతుంది. దీనికై అభ్య‌ర్ధులు క్రింది స‌బ్జ‌క్టుల‌ను చ‌ద‌వాల్సి ఉంటుంది.
1. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ మ‌రియు క‌రెంట్ అఫైర్స్ - 5 మార్కులు
2. టీచింగ్ ఆప్టిట్యూడ్ - 5 మార్కులు
3. జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్ - 10 మార్కులు
4. జ‌న‌ర‌ల్ తెలుగు - 20 మార్కులు
5. గ‌ణిత‌ము - 20 మార్కులు
6. భౌతిక ర‌సాయ‌న శాస్త్ర‌ములు - 10 మార్కులు
7. జీవ‌శాస్త్ర‌ము - 10 మార్క‌లు
8. సాంఘిక‌శాస్త్ర‌ము - 20 మార్కులు
అభ్య‌ర్ధులు ఆయా స‌బ్జ‌క్టుల కోసం ప్ర‌స్తుత 8, 9, 10 త‌ర‌గ‌తుల సిల‌బ‌స్‌ల‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయాల్సి ఉంటుంది. ఆయా పుస్త‌కాల‌ను సేక‌రించుకుని ప్ర‌తి పాఠ్యాంశాన్ని శ్ర‌ద్ద‌గా చ‌దువుతూ, ఆయా పాఠ్యాంశాల‌లో ఇవ్వ‌ద‌గిన ప్ర‌శ్న‌ల‌ను ఒక నోటు పుస్త‌కంలో రాసుకుంటూ సొంతంగా నోట్సును రూపొందించుకోవ‌డం ద్వారా సంపూర్ణ అవ‌గాహ‌న పొంద‌వ‌చ్చు. గ‌త సంవ‌త్స‌ర‌పు ప్ర‌శ్నాప‌త్రాల స‌ర‌ళిని ప‌రిశీలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీసెట్ పరీక్ష‌లోని ప్ర‌శ్న‌లు కొంచెం సుల‌భంగా అనిపించిన‌ప్ప‌టికీ తెలంగాణా డీసెట్ ప‌రీక్ష‌లోని ప్ర‌శ్న‌లు క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌లుగా చెప్ప‌వ‌చ్చు. అంటే ప‌రీక్ష‌లో విద్యార్ధుల‌ను గ్రేడింగ్ చేయాల్సిన కార‌ణంగా కొద్దిగా కఠిన‌మైన ప్ర‌శ్న‌లే అడిగే అవ‌కాశం ఉన్న‌కార‌ణంగా అభ్య‌ర్ధులు ఏదో అయింద‌నిపించేలా ప్రిప‌రేష‌న్ స‌రిపోదు. ప్ర‌తి కీల‌క అంశాన్ని సూక్ష్మ‌స్థాయి వ‌ర‌కూ తెలుసుకోవ‌డం అవ‌స‌రం.
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ మ‌రియు క‌రెంట్ అఫైర్స్ విభాగాల‌నుంచి 5 ప్ర‌శ్న‌లు అడుగుతారు. దీనికోసం విద్యార్ధులు నిత్యం దిన‌ప‌త్రిక‌ను చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి. ముఖ్య‌మైన అంశాల‌ను నోటు చేసుకుంటూ వాటికి సంబంధించిన గ‌తవిష‌యాల‌ను, స్టాండ‌ర్డ్ జికే విభాగాల‌ను కూడా చ‌ద‌వాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఇటీవ‌ల భార‌త నావిగేష‌న్ శ్రేణిలో ఆర‌వ ఉప‌గ్ర‌హాన్ని క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దీన్ని ఆధారంగా చేసుకుని మొద‌టి ఉప‌గ్ర‌హాన్ని గురించి, చంద్ర‌డు, అంగార‌కుడు వంటివాటిపై భార‌త ప్ర‌యోగాల‌ను గురించి ఈ విభాగంలో ప్ర‌శ్నించ‌వ‌చ్చు. అలాగే ఒక మంచి పుస్త‌కాన్ని ఎంచుకుని స్టాండ‌ర్డ్ జికెలో కూడా రోజుకు కొన్ని అంశాల‌వంతున చ‌దువుకోవాల్సి ఉంటుంది.
టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేది అభ్య‌ర్ధుల‌కు ఉపాధ్యాయవృత్తిపై ఎంత‌వ‌ర‌కూ మ‌క్కువ ఉన్న‌దో తెలుసుకోవ‌డానికి ఉద్దేశించిన‌ది. దీనిలో స‌మాధానాల‌ను విద్యార్ధికోణంలో ఆలోచించి రాయ‌డం ద్వారా చాలావ‌ర‌కూ స‌మాధానాలు స‌రైన‌వి అయ్యే అవకాశం ఉంటుంది. విద్యాభివృద్ధికోసం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు, విద్యాప్ర‌ణాళిక‌లు, వివిధ క‌మీష‌న్‌లు చెప్పిన అంశాల‌ను గురించి కూడా విద్యార్ధులు తెలుసుకోవాలి.
జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్ విభాగంలో గ్రామ‌ర్‌నుంచి ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఎక్కువ‌. ఆర్టిక‌ల్స్, ప్రిపొజిష‌న్స్‌, డైర‌క్ట్ ఇన్‌డైరక్ట్ స్పీచ్‌, వాయిస్‌, టెన్స్‌, వెర్బ్‌ఫామ్స్‌,సెంటెన్సెస్‌, వ‌కాబుల‌రీ వంటి విభాగాల‌నుండి ఎక్కువ‌గా ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు. అభ్య‌ర్ధులు ఇంగ్లీష్ గ్రామ‌ర్‌ను క్షుణ్ణంగా చ‌దివి, వీలైనంత ఎక్కువ‌గా ప్రాక్టీస్‌ప్ర‌శ్నల‌ను ప్రాక్టీస్ చేయ‌డం ద్వారా ప‌ట్టు సాధించ‌వ‌చ్చు.
జ‌న‌ర‌ల్ తెలుగు విభాగంలో తెలుగు వ్యాక‌ర‌ణంతో పాటుగా పాఠ్యాంశంలోని క‌వులు, కావ్యాలు, ర‌చ‌న‌లు, ర‌చ‌యిత‌లు, పాఠ్యాంశంలోని ఘ‌ట్టాలు, పాఠ్యాంశాల‌లోని పాత్ర‌లు మొద‌లైన అంశాల‌పై కూడా ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది. ఛంద‌స్సు, అలంకారాలు, సంధులు, స‌మాసాలు, వాక్య‌రీతులు, వ‌ర్ణ‌మాల వంటి అంశాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చాలి.
గ‌ణిత‌ము, భౌతిక ర‌సాయ‌న శాస్త్రాలు, జీవ‌శాస్త్రం మ‌రియు సాంఘిక శాస్త్ర‌ముల విష‌యానికి వ‌స్తే ప్ర‌శ్న‌లు అన్నీ కేవ‌లం పాఠ్య‌పుస్త‌కాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నిస్తే, పాఠ్య‌పుస్త‌కాల‌ను క్షుణ్ణంగా చ‌ద‌వ‌డం ద్వారా మంచి మార్కులు సాధించ‌వ‌చ్చు. దీనికోసం పాఠ్య‌పుస్త‌కాల‌ను సేక‌రించుకుని నోట్సును ప్రిపేర్ చేసుకోవ‌డం మంచిది. ముఖ్య‌మైన అంశాల‌ను ప‌దేప‌దే చ‌దివి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫార్ములాలు, శాస్త్రీయ‌నామాలు, సంవ‌త్స‌రాలు వంటివి ప‌దేప‌దే గుర్తు చేసుకోవ‌డం ద్వారా ఎక్కువకాలం గుర్తుండే అవ‌కాశం క‌లుగుతుంది. ప్ర‌స్తుత పాఠ్య‌పుస్త‌కాల‌న్నీ సిసిఈ విధానంలో అందే విద్యార్ధి కేంద్రీకృతంగా రూపుదిద్దుకోవ‌డంతో, వ‌చ్చే ప్ర‌శ్న‌లు కూడా విద్యార్ధి కేంద్రంగానే అడిగే అవ‌కాశం ఉంది. అందుకే మోడ‌ల్ పేప‌ర్ల‌ను సేక‌రించుకుని ప్ర‌శ్న‌లు అడుగుతున్న తీరును గ‌మ‌నించి ప్రిపేర్ కావాలి.
బృంద‌బోధ‌న వ‌ల‌న ఒక‌రికి తెలియ‌ని విష‌యాలు మ‌రొక‌రికి తెలిసే అవ‌కాశం కలుగుతుంది. అయితే ఆ బృందంలో అంద‌రూ చ‌దివే విద్యార్ధుల‌ను ఎంచుకోవ‌డం మ‌రువ‌కూడ‌దు. బృందంగా ఏర్ప‌డిన త‌రువాత ముందుగా ఒక నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏరోజు ఏ త‌ర‌గ‌తినుంచి ఏ పాఠ్యాంశంనుంచి ప్ర‌శ్న‌లు చ‌ద‌వాల‌నే విష‌యాలతో ఒక ప్రణాళిక‌ను సిద్ధం చేసుకోవాలి. ఆ త‌రువాత బృందంలోని ప్ర‌తి స‌భ్యుడు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ చ‌దివి, ఆయా విభాగాల‌నుంచి బృందాన్ని బ‌ట్టి క‌నీసం ఒక ప‌ది ప్ర‌శ్న‌లు ఆబ్జెక్టివ్ రూపంలో త‌యారుచేసుకోవ‌డం, సాయంత్రం ఒక స‌మ‌యాన్ని నిర్దేశించుకుని, ప్ర‌తి విద్యార్ధి త‌న స‌హ‌విద్యార్ధుల త‌యారుచేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను రాయ‌డం ద్వారా బృందంలో వారికివారే స్వీయ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. ప్ర‌శ్న‌లు అడిగే తీరు కూడా తెలుసుకోవ‌చ్చు.
అన్నింటినీ మించి ల‌క్ష్య‌సాధ‌న కోసం క‌ష్టించి చ‌దివిన‌పుడు మాత్ర‌మే చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంద‌ని అభ్య‌ర్ధులు దృష్టిలో ఉంచుకుని చ‌ద‌వాలి. ముఖ్యంగా ఇంట‌ర్‌మీడియ‌ట్ జాలీలైఫ్‌నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పెద్ద‌వారిగా ఆలోచిస్తూ నా ఈ కొద్దిరోజుల క‌ష్టం జీవితాంతం సుఖాన్ని అందించ‌బోతోంద‌ని మ‌న‌సులో ఉంచుకుని క‌ష్ట‌ప‌డి చ‌ద‌వ‌డం ద్వారా మెరుగైన ఫ‌లితాన్ని సాధించే అవ‌కాశం ఉంది.




























    

Post a Comment

Previous Post Next Post