ప్రభుత్వ పాఠశాలలు బ్రతికి బట్టకట్టాలంటే నా ఆలోచనాలివే . . .
- ముందుగా ఉపాధ్యాయుల వైఖరిలో సమూలంగా మార్పు రావాలి.
- మనం ఒప్పకున్నా లేకున్నా మనలో కొందరం పాఠశాల నాది, పిల్లలు మన పిల్లలు అంటూ పాఠాలు చెబుతుంటే మరికొందరం నేనెలా చెప్పినా నా జీతంలో మార్పు ఉండదంటూ వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాం.
- ఈ మన ఆలోచనా విధానంలో మార్పు తప్పకుండా రావాలి. అప్పుడు మాత్రమే మనం, మన యూనియన్లు కలసి విద్యా విధానంపై పోరాడగలం.
- ఉపాధ్యాయులు నూతన పోకడలను అందుకుంటున్నారో తెలుసుకునేలా పరీక్షల ద్వారా తెలుసుకునే విధానాన్ని అమలు చేయాలి.
- మన విద్యార్ధులకు రేపు పరీక్ష పెడతాను చదువు అన్నప్పటికీ, మామూలుగా రేపు చదవండి అన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇదే ఉపాధ్యాయులకు వర్తిస్తుంది. అందుకే కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి మన సబ్జక్టుల్లోని నూతన పోకడలపై ఒక పరీక్ష వంటిది ఉంటే బావుంటుందనేది నా అభిప్రాయం
- ఆ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడం ఉత్తమం. లేదంటే ఆ విధానంలో లొసుగులు వెతకడానికి మనమెన్నో కదా . . .
- ప్రతీ గ్రామంలోనూ, వీధిలోనూ పాఠశాల అన్న విధానానికి స్వస్తి పలకాలి.
- కనీసం జనావాసానికి మూడు కిలోమీటర్లలో ఒక మంచి పాఠశాల ఉండే ఏర్పాటు చేయడం ఉత్తమం.
- మంచి ప్రైవేటు పాఠశాలకు మూడేంటి పది, పదిహేను కిలోమీటర్ల దూరానికి వెళ్లి చదువుకోవడం మనం చూస్తూనే ఉన్నాము.
- అందుకే ప్రస్తుత క్లస్టర్ విధానాన్ని (ప్రభుత్వ విధానం కాదండి, నేను చెప్పబోతున్నది) నేను సపోర్ట్ చేస్తాను.
- ఒక మంచి పాఠశాల అందులో ప్రతీ తరగతి 30 మందికి ఒక సెక్షన్, ప్రతీ సెక్షన్‌కు ఒక ఉపాధ్యాయుడు, మరియు తరగతి గది ఉండాలి.
- ఆ పాఠశాలకు విద్యార్ధులను చేరవేసేందుకు రవాణా వసతి ఉండాలి. అంటే బస్ అని ఆలోచించకుండా ప్రైవేటు పాఠశాలల మాదిరి చిన్నతరహా వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలి. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి కనీస జీతంతోకూడా సిద్ధంగా ఉన్నారు.
- ఇలాంటి తరహా ఉన్నప్పటికీ విద్యార్ధి బడిమానేసే అవకాశం లేకపోలేదు.
- విద్యార్ధి బడిమానకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిదే అన్నంత కాలం ఈ సమస్య మారదు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాఠశాలలో పాఠాలు చెప్పడంలో నిమగ్నులై ఉంటారు కానీ, ఒకరో ఇద్దరో మానివేస్తే వారొక్కరే ఏమీ చేయలేరు.
- అందుకే ఉపాధ్యాయునితో పాటు తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేయాలి.
- రేషన్ సరుకులతోనో, మరొకదానితోనో పాఠశాల ప్రధానోపాధ్యాయులను అనుసంధానించాలి. అంటే వారి అనుమతితోనే రేషన్ సరుకులు పోందడమే మరోటో ఇలా. . . . బడికి విద్యార్ధి రాకుంటే ప్రధానోపాధ్యాయులు పిల్లల తల్లదండ్రులకు చిన్న శిక్ష విధించేలా. . . .
- ఇక పాఠశాలల్లో జీవం పెంచాలి. మన పాఠశాలలు పక్కా భవనాలతో నిర్మితం అయినప్పటికీ సెక్షన్‌లకు సరిపడా తరగతి గదులు ఉండటం లేదు. గదులు సరిపోవట్లేదంటూ ప్రధానోపాధ్యాయులు కోరిన తరువాత, గదులు నిర్మితం కావడానికి పది సంవత్సరాలు పట్టేలా ఉంది పరిస్థతి.
- ఇలా కాకుండా పక్కా భవనాలతో పాటు రేకులతో కూడిన నిర్మాణాలు కూడా చేస్తూ (చాలా ప్రైవేటు పాఠశాలలు ఇలాంటివే కదా?) 30 మంది విద్యార్ధులకు ఒకటి వంతున తరగతి గదులను నిర్మించాలి.
- ప్రతీ పాఠశాలలో ప్రయోగశాల గది తప్పకుండా ఉండేలా చూడాలి.
- ఒక డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి.
- అబ్బో అనిపిస్తోంది కదండీ . . కానీ మూడు గదుల పక్కా భవనానికి మన పాఠశాలలు పెట్టే ఖర్చు సుమారు పదిహేను లక్షలతో ప్రైవేటు పాఠశాలలు రేకులతో పదిహేను గదులతో పాటు, ఒకగదిలో అదనంగా పాతిక వేలతో డిజిటల్ క్లాస్ రూమ్, మరో గదిలో మరో పాతిక వేలతో మంచి ప్రయోగశాలను నిర్మించగలుగుతున్నాయి. కాదంటారా?
- ఇక ఈ ఆస్తుల పరిరక్షణ గురించి ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఆలోచించడంలేదు. రాత్రి సమయాలలో పాఠశాలలను రక్షణకోసం వ్యక్తులను ఏర్పాటు చేయాలి. ఇతర పనులు చేయలేని వృద్ధులను, ఇతరులను ఇలాంటి బాధ్యతకు కేటాయించి కనీస వేతనాన్ని ఇవ్వవచ్చు.
- 8వ తరగతి వరకూ చదువును తప్పనిసరి చేయాలి. అప్పటివరకూ విద్యార్ధి కేవలం తెలుగులో మాత్రమే చదివేలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో మార్పులు తీసుకురావాలి.
- కఠినమైన పరీక్షను నిర్వహించి దానిలో ఉత్తీర్ణులైన, ఆసక్తి గల విద్యార్ధులకు మాత్రమే ఆంగ్ల మాధ్యమ బోధన అందించాలి.
- ఆంగ్లమాధ్యమ బోధనే ఉన్నత చదువులకు అవకాశమిస్తుందనే భావనను మార్చాలి. మాతృభాషలో జరిగే అభ్యసనమే సమర్ధవంతమైనది అని తల్లదండ్రులకు అవగాహన కలిగించాలి. (నిజం కాదంటారా?)
- ఎయిడ్స్ గురించిన చక్కని వాణిజ్య ప్రకటనలతో ప్రజలలో అవగాహన తీసుకొచ్చారు. టివి9 వారు మట్టి వినాయకులనే వాడమని పదేపదే చెబితే మట్టి వినాయకుల సంఖ్య పెరిగినది మనం గమనించలేదా? కనుక మనస్పూర్తిగా చిత్తసుద్దితో ప్రయత్నం చేస్తే సమయం తీసుకోవచ్చు కానీ ఆంగ్లమోజు తగ్గించొచ్చు. మెరుగైన విద్య అందించొచ్చు.
- ఎనిమిదవ తరగతి వరకూ విద్య తప్పనిసరి చేయాలి.
- మూడు, ఐదు, ఎనిమిదవ తరగతులలో సెమిస్టర్ విధానం అమలు చేయాలి. సహజంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మూడు ఐదు, 8 తరగతులు చేరుకున్న విద్యార్ధులు ఆయా తరగతులకు చేరుకోవాల్సిన లక్ష్యాలను కొందరు చేరుకోలేకపోవచ్చు.
- అటువంటి వారికి ఆపై చదువు కొనసాగించడానికి అవసరం అయిన కనీస బేసిక్స్ నేర్పించడానికి ఈ సెమిస్టర్ విధానాన్ని వినియోగించుకోవాలి.
- ఉదాహరణకు కొందరు 6వ తరగతి విద్యార్ధులను చూసి మనం ఐదు వరకూ ఏమి నేర్చుకున్నావురా బాబూ అంటూ తలపట్టుకుంటాం. అయితే అటువంటి విద్యర్ధితో పాటు అందరు విద్యార్ధులకు విద్యాసం. ప్రారంభంలో నిర్వహిస్తున్న రెడీనెస్ ప్రోగ్రామ్ సమయంలో ఆనెల పాఠాలు యధాతధంగా బోధించాలనడంతో లక్ష్యం మరుగున పడిపోతోంది. అందుకే సెమిస్టర్ పెట్టి మెదటి సెమ్‌లో డల్లర్, యావరేజ్, జెమ్ లకు విడిగా పరీక్ష, ఆపై రెండో సెమ్‌లో మళ్ళీ ఒకటి చేసే అవకాశం ఉండాలి. మొదటి సెమ్ పైన ఉదహరించిన విధంగా తరగతిని వేరుచేసుకుని రెడీనెస్ నిర్వహించేలా చేయాలి.
- ఆ తరువాతి తరగతి నుంచి విద్యా విధానంలో సమూలమార్పులు అత్యావశ్యకం
- ముఖ్యంగా వృత్తి విద్య సౌకర్యాలు అమలులోకి తీసుకురావాలి.
- 8 తర్వాత చదువు కొనసాగిద్దామనుకుంటున్నవారికి సాధారణ అకడమిక్ చదువు సౌకర్యం కల్పించాలి.
- చదువు సాగించలేమని తలంచిన విద్యార్ధులకు లేదా తక్కువ ప్రగతి చూపే విద్యార్ధులకు సాధారణ విద్యకు బదులుగా వృత్తి విద్య అందించాలి.
- ప్రస్తుతం ఏ విద్యార్ధి ఫెయిల్ కాకూడదంటూ వస్తున్న ఒత్తిడిల వలన విద్యార్ధులు ఫెయిల్ కావడం లేదు. కానీ అది ఎందుకో మనందరికీ తెలిసిందే. అలా ముందుకు నడుస్తున్న (నెట్టబడుతున్న) విద్యార్ధి ఇంటర్ పూర్తి చేశాక తెలుసుకుంటున్నాడు తనకు చదువురాదని. ఆపై మొదలు పెడతాడు వృత్తిని.
- అందుకే ప్రతీ విద్యార్ధి పాస్ కావాలన్న తప్పడు భావనను 8 తరగతి తర్వాత తప్పించాలి.
- పెయింటింగ్, రేడియో & టివి మెకానిజం, సెల్‌ఫోన్ మెకానిజం, వివిధ పరిశ్రమలలో పనిచేయడానికి కావలసిన నైపుణ్యాలు, నర్సింగ్, హాస్పటాలిటీ రంగానికి చెందిన శిక్షణ, డ్రైవింగ్, వంటి వృత్తి విద్యలతో కూడిన ఐటిఐలు ప్రతి మండలానికి కనీసం రెండు వంతున ఏర్పాటు చేయాలి.
- వీటి వల్ల చేతి వృత్తులు బలపడి నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతీ వ్యక్తీ తను కష్టించిన స్థాయిని బట్టి, నేర్చుకున్న స్కిల్‌ను బట్టి ఏదైనా రంగంలో సి్థరపడే వెసులుబాటు కలుగుతుంది.
- అలాగే ఉన్నత పాఠశాలల్లో కూడా డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆదునిక ప్రయోగ శాల ఏర్పాటు, రాత్రి సమయాల్లో రక్షణ వంటి సౌకర్యాలను కల్పించాలి.
మనం మునిగిపోతున్న నావలో ఒక మూలన కూర్చుని నా స్థానం పదిలమన్న భావనలో ఉన్నాము.
ఆ భావననుంచి బయటకు రావాలి. పాఠశాలలను బ్రతికించుకోవాలి. మనం బ్రతకాలి. విద్యారంగంలో అలక్ష్యం కొన్ని తరాలనే నాశనం చేస్తుంది
మీరేమంటారు?
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఫోన్ 9441687174
నా అంతరంగం (లోపలికి తొంగి చూడకండి). . .
Tags
MYS