మారిన సివిల్స్‌ తీరు- అవగాహనే ముఖ్యం

మారిన సివిల్స్‌ తీరు- అవగాహనే ముఖ్యం
ఇంటర్వ్యూల్లో మార్పులు
పుస్తకంలో ఉన్నది కాదు.. ఎలా అర్థం చేసుకున్నారన్నదే ముఖ్యం
‘విపరీతమైన తెలివితేటలు అక్కర్లేదు! రోజుకు 16 గంటలు కట్టుకదలకుండా కూర్చుని పుస్తకాలను ఒక పద్ధతిలో చదివితే చాలు! సివిల్స్‌ కొట్టేయొచ్చు!’... ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం ఇది. ఇకపై పుస్తకాల్లోని అక్షరాలను చదివితే చాలదు! విషయాన్ని మనసుకు ఎక్కించుకోవాలి. ఆ విషయాన్ని స్పష్టంగా మాటల్లో వివరించగలగాలి! ఈ దిశగా సివిల్స్‌ నిర్వహణలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.
సివిల్స్‌.. పోటీ పరీక్షల్లో అదో ఎవరెస్ట్‌! ఆ హిమవన్నగ అధిరోహణకు ఎంత తపన ఉండాలో.. సివిల్స్‌ సాధించాలన్నా అంతకన్నా ఎక్కువే ఉండాలి. అయితే ఇప్పుడు సివిల్స్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకప్పటిలా ఇప్పుడు సివిల్స్‌ ఇంటర్వ్యూ ఉండట్లేదు. పుస్తకంలో ఏముందో అందరికీ తెలుసు. కానీ, దానిలోని అంశాన్ని ఓ అభ్యర్థి ఎలా అర్థం చేసుకున్నాడన్నదే సివిల్స్‌ను నిర్వహిస్తున్న యూపీఎస్సీ ఆలోచిస్తున్న విధానం. ఆ అంశంపై లేదా వర్తమాన, భౌగోళిక, రాజకీయ తదితర పరిణామాలపై సూటిగా.. సుత్తి లేకుండా అభిప్రాయాన్ని చెప్పాలి. 80వ దశకంలో పోటీ పరీక్ష అంటే.. ఎత్తయిన పర్వతాలు, లోతైన సముద్రాలు, పొడవైన నదులు లేదా వంతెనలు ఇలాంటివాటిపై ప్రశ్నలు ఉండేవి. సివిల్స్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 90వ దశకంలో ఇది విశ్లేషణల పరీక్షగా మారింది. ఇప్పుడు అభ్యర్థి ఓ విషయాన్ని ఎలా చూస్తున్నాడన్నదే యూపీఎస్సీ గమనిస్తోంది. కొద్ది రోజుల క్రితం 2014 సివిల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో దశాబ్ద కాలంలో సివిల్స్‌ ఎలాంటి మార్పులకు లోనైందో చెబుతున్నారు ఎంపికైన అభ్యర్థులు, కోచింగ్‌ నిపుణులు, అనుభవజ్ఞులు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై అభిప్రాయం చెప్పాలని మొన్న ఇంటర్వ్యూలో ఓ అభ్యరిని అడిగారు. కర్ర విరగకుండా, పాము చావకుండా సమాధానం చెప్పాలని ప్రయత్నించాడు సదరు అభ్యర్థి. ‘డిప్లొమాటిక్‌గా చెప్పొద్దు, నీ అభిప్రాయం చెప్పు’ అని సూచించారు బోర్డు సభ్యులు. ఉత్తర తెలంగాణకు చెందిన మరో అభ్యర్థిని.. ‘ఒకప్పుడు నువ్వుండే విద్యా సంస్థ, నగరం తీవ్రవాద కార్యకలాపాలకు హబ్‌గా ఉండేది కదా? ఇప్పుడా సమస్య ఎలా సద్దుమణిగింది?’ అని అడిగారు. గ్లోబలైజేషన్‌తో తమవారంతా కెరీరిస్టులుగా మారారని సమాధానంలో భాగంగా చెప్పాడు అభ్యర్థి. గ్లోబలైజేషన్‌తో అన్నీ విపరిణామాలే అన్నది విమర్శ కదా అని రెట్టించారు బోర్డు సభ్యులు. ఎలాంటి పరిణామాలకైనా కనీసం ఇరవై శాతం సానుకూలత ఉంటుందని, అదే తమ ప్రాంతం అనుభవిస్తోందని చెప్పి సభ్యులను సంతృప్తిపరిచాడు. ఈ రెండూ ఏ పాఠ్యపుస్తకంలోనూ ఉండవు. అంతమాత్రాన పాఠ్యపుస్తకాల అవసరం లేదని ఎవరూ అనరు. మూల అంశం పుస్తకంలోనే ఉంటుందన్నది నిజం. వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలు, దాని క్రమాభివృద్ధి వంటి విషయాలకు ప్రామాణిక పుస్తకాలే ఆధారం. అయితే దాన్నుంచి ఏమి నేర్చుకున్నావన్నది ఇప్పటి ప్రశ్న. పుస్తకంలో లేదా కోచింగ్‌ సంస్థల మెటీరియల్‌ నుంచి ఉన్నదున్నట్లు దింపేద్దామంటే కుదరదని తేలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్ట్స్‌బేస్డ్‌ ప్రశ్నలు తగ్గుతున్నాయి. జరిగిన లేదా జరగబోయే విషయాలపై అభిప్రాయం చెప్పమంటున్నారు. లేదంటే వ్యాఖ్యానించు, చర్చించు అని అడుగుతున్నారు. అందువల్లే మునుపటితో పోలిస్తే సివిల్స్‌ మెయిన్స్‌లో ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఆఖరుకు ఎస్సే పేపర్‌లోనూ రాయాల్సిన వ్యాసాల సంఖ్యను పెంచారు. జనరల్‌ పేపర్లలో గ్రామీణ ప్రాంతాలపై ప్రశ్నలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ పట్టణ ప్రాంత అభ్యర్థికన్నా.. గ్రామీణ ప్రాంత అభ్యర్థి ఎక్కువగా లాభపడుతుంటం వాస్తవం.
సూటిగా, సుత్తి లేకుండా
ఆమిర్‌ఖాన్‌ త్రీ ఇడియట్స్‌ సినిమా చూసే ఉంటారు కదా! అందులో క్లాస్‌రూంలో లెక్చరర్‌ అడిగిన ప్రశ్నకు తేలికైన పద్ధతిలో సమాధానం చెప్తాడు. అయితే అది సదరు అధ్యాపకుడికి నచ్చదు. టెక్నికల్‌గా చెప్పమంటాడు. కానీ, సివిల్స్‌లో మాత్రం క్లిష్టంగా కాకుండా.. సరళంగా, సూటిగా.. సుత్తిలేకుండా చెప్పాలంటున్నారు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు. రాజ్యాంగపరమైన అంశాలను సాధారణంగా లా చదివిన విద్యార్థులు బాగా చెప్పగలరు. అయితే తమ పరిభాషలో రాసిన ఆ విద్యార్థుల కన్నా.. తాజా ఉదాహరణలతో రాసిన అభ్యర్థులు ఈసారి ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. నేటి విద్యా విధానం పూర్తిగా ఆబ్జెక్టివ్‌ ఓరియెంటెడ్‌ ప్రశ్నలకు నెలవుగా మారింది. ఒక విషయంపై సంక్షిప్తంగా, చక్కటి వాక్యాల్లో రాసే విధానం క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ విషయాన్ని గమనించిన యూపీఎస్సీ దానిపై పట్టుబిగిస్తోంది. విషయం, వ్యాకరణంపై పట్టు, భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యం తదితరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో అనిశ్చితి పెరిగిందన్నది మాత్రం కాదనలేని వాస్తవం.
పోస్టులు పెరిగాయి- ఇంటర్వ్యూ టైం తగ్గ్గింది
దశాబ్దం క్రితం యూపీఎస్సీ 500 నుంచి 700 పోస్టులకు మాత్రమే సివిల్స్‌ నోటిఫికేషన్‌ వెలువరించేది. ఇది ఇటీవ
కాలంలో 1200కు మించింది. ఒక పోస్టుకు ముగ్గురు అంటే మూడు వేలమంది నుంచి 3600 మందిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తోంది. దాంతో గతంలో గంటవరకు ఉన్న ఇంటర్వ్యూ నిడివి కాస్తా ఇప్పుడు పాతిక నిమిషాలకు కుదించుకు పోయింది. పరీక్ష యావత్తూ జనరల్‌గా మారుతున్నందున కోచింగ్‌ అవసరం లేదా అన్నది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న. అసలు కోచింగ్‌తో ఎప్పుడైనా గరిష్ఠంగా నలభై శాతానికి మించి ప్రయోజనం ఉండదని ప్రముఖ కోచింగ్‌ సంస్థ లా ఎక్స్‌లెన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు చెబుతున్నారు. పరీక్ష స్వరూప స్వభావాలు, ఎగ్జామ్‌ టిప్స్‌ తెలియాలంటే కోచింగ్‌ నిపుణుల సహకారం తప్పనిసరి అంటున్నారు.
అందరికీ సమానమే
తాజా సివిల్స్‌ ఏ ఒక్కరిదో కాదు అన్ని వర్గాలదీ. కొన్నాళ్ళ క్రితం ప్రిలిమినరీ సీశాట్‌గా మారినప్పుడు అది ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు అనువుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామీణ, హిందీయేతర అభ్యర్థులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో గత ఏడాది ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ సంబంధ ప్రశ్నలను యూపీఎస్సీ తొలగించింది. ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు అనుకూలంగా ఉంటోందంటున్న ప్రిలిమ్స్‌ రెండో పేపర్‌ను అర్హతను తేల్చేదిగా ఈ ఏడాది మార్చింది. ఫలితంగా లెక్కలు తదితరాల్లో కనీస పరిజ్ఞానంతో ఆ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇకపై పోటీ అంతా జనరల్‌ స్టడీ్‌సతోనే. ఒకరకంగా ఆర్ట్స్‌ తదితర సబ్జెక్టుల అభ్యర్థులు పోటీపడవచ్చని తేల్చినట్లే. అయితే ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు మరొక విషయం చెబుతున్నారు. ఈ స్రీ్ట్రమ్‌ల్లోని విద్యార్థులకు మొదటి నుంచి ప్రాక్టికల్స్‌, టెస్టులు ఎక్కువ. దాంతో పరీక్షలకు సన్నద్ధత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ మనస్తత్వం, పోటీతత్వమే ఇక్కడా ఉపయోగపడుతోందని, లేటెస్ట్‌ ఫలితాలు దాన్ని స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. అలాగే గ్రామీణ, పట్టణ అంతరం కూడా తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. చివరగా ఎంత చదివామన్నది కాదు, ఏం తెలుసుకున్నామన్నదే పాయింట్‌. సివిల్స్‌లో విజయానికి అదే దగ్గరిదారి.

Information Collected & Shared by
Sri P.V. Narasimharao garu,
UTF Leader, West Godavari District



    

Post a Comment

Previous Post Next Post