కరెంట్ అఫ్ఫైర్స్ - నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలు

నదుల అనుసంధానం.. సాధ్యాసాధ్యాలు
దేశంలో ఒక చోట సేద్యపు నీరు లేక లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు బీడుపోతుంటాయి.
మరో పక్క... మరో చోట... లక్షల క్యూసెక్యుల నీరు వృధాగా సముద్రం పాలవుతుంటుంది.
ఇలా వృధాగా సాగరంలో కలసిపోయే నీటిని బీడు భూములకు అందిస్తే సస్యశ్యామలమవుతాయి.
ఈ ఆలోచన ఇప్పటిది కాదు దశాబ్దాల కల. కానీ ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు.
దీనిపై సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా విచారణలో ఉంది. నదుల అనుసంధానంపై దృష్టి పెట్టమని ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించమని సుప్రీంకోర్టు 2012 ఫిబ్రవరి 27వ తేదీన కేంద్రాన్ని ఆదేశించడంతో నదుల అనుసంధాన అంశం మరొకసారి తెరపైకి వచ్చింది.

నదుల అనుసంధానం అనే మాట ఇప్పటిది కాదు. బ్రిటీష్ వారి హయాంలోనే ఇందుకు బీజం పడింది. 1972లో అప్పటి సాగునీటి మంత్రి కె.ఎల్.రావు 2640 కిలోమీటర్ల సుదీర్ఘమైన కాలువ ద్వారా గంగా, కావేరి నదుల అనుసంధానానికి ప్రతిపాదించారు. నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలపై సర్వేలు నిర్వహించడానికి 192లో జాతీయ జల అభివృద్ధి ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది.
నదుల అనుసంధానంలో రెండు భాగాలున్నాయి. ఒకటి ఉత్తరాది హిమాలయన్ నదీ అభివృద్ధి ప్రణాళిక. రెండోది దక్షిణాది ద్వీపకల్ప నదుల అభివృద్ధి ప్రణాళిక.

ప్రస్తుత ప్రతిపాదనలివీ...
దేశంలో నదుల అనుసంధానానికి అనువైన 30 ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది. వీటిని సాంకేతికంగా సాధ్యమైనవిగా... ఆర్థికంగా వెసులుబాటు అయినవిగా.. గుర్తించడం జరిగింది. అవి... మహానది (మణిభద్ర) -గోదావరి (ధవళేశ్వరం) అనుసంధానం, గోదావరి (ఇచ్చంపల్లి లోయర్ డ్యాం)-కృష్ణా అనుసంధానం, గోదావరి (ఇచ్చంపల్లి)-కృష్ణా (నాగార్జునసాగర్), గోదావరి (పోలవరం)-కృష్ణా (విజయవాడ), కృష్ణా (ఆల్మట్టి)-పెన్నార్, కృష్ణా (శ్రీశైలం)-పెన్నార్, కృష్ణా (నాగార్జునసాగర్)-పెన్నార్ (సోమశిల), పెన్నార్ (సోమశిల)-కావేరి నగాండ్‌అనికట్), కావేరి (కట్టల్సి)- వైగాయ్-గుండూర్, కెన్-బెత్వా, పర్బతి-కాలిసింధ్‌చంబల్, పార్-తాపి-నర్మద, దమన్‌గంగ-పింజల్, బెడ్టి-వర్ద, నేత్రావతి-హేమావతి, పంబ-అచన్‌కోవిల్- వైప్పార్ అనుసంధానం.

మరోవైపు హిమాలయన్ కాంపొనెంట్‌లో నీటి నిల్వల అంచనాల ఆధారం చేసుకుని చేసిన అధ్యయనం ప్రకారం.. సాధ్యాసాధ్యాల నివేదికల తయారీకి గుర్తించిన ప్రతిపాదనలివీ.. మానస్-సంకోష్-తీస్తా నదుల అనుసంధానం, కోసి-గాగ్రా, గాగ్రా-యమున, శారద-యమున, యమున-రాజస్థాన్, రాజస్థాన్-సబర్మతి, చునార్-సోనే బ్యారేజ్, సోనే డ్యామ్-గంగా నది దక్షిణ ఉప నదులు, గంగా-దావెూదర్-సువర్ణరేఖ, సువర్ణరేఖ-మహానది, కోసి-మెచి, ఫరక్కా-సుందర్బన్స్, జోగిగోపా-తీస్తా, ఫరక్కా నదుల అనుసంధానం.
అనుసంధానంతో ఉపయోగాలివీ..

నదుల అనుసంధానం వల్ల ప్రాంతాలవారీగా వివిధ నదీ బేసిన్‌లలో జలాల లభ్యతలో ఉన్న అసమానతలను సరిచేసేందుకు వీలవుతుంది. మరోవైపు మిగులు జలాలు వృథాగా సముద్రంలో కలవడాన్ని నిరోధించవచ్చు. నదుల అనుసంధానం వల్ల 35 మిలియన్ హెక్టార్ల భూమికి అదనంగా సాగునీటి ప్రయోజనం లభిస్తుంది. అంతేగాక భూగర్భ జలాల మట్టం పెరిగేందుకు తోడ్పడుతుంది. సంప్రదాయ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అంతిమంగా 140 మిలియన్ హెక్టార్ల భూమికి సాగునీటి సదుపాయం కల్పించాలన్న లక్ష్యానికి మించి అదనంగా భూమికి సాగునీరు అందించడానికి వీలవుతుంది. నీటి నిల్వ కోసం ప్రతిపాదిస్తున్న డ్యామ్‌ల వల్ల వరదలు, వాటి వల్ల వచ్చే నష్టాలను నివారించేందుకు వీలవుతుంది. గంగా, బ్రహ్మపుత్ర నదీ బేసిన్లలో వరదల తీవ్రతను 20 నుంచి 30 శాతం మేరకు తగ్గించేందుకు వీలు కానుంది. అంతర్ నదీజలాల బదిలీ వల్ల కరువు సమస్యను అధిగమించడం సాధ్యపడుతుంది. దీని వల్ల పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో 25 లక్షల హెక్టార్ల మేరకు అదనపు భూములకు సాగునీటి సదుపాయం ఏర్పడుతుంది.

మరోవైపు జల విద్యుత్తు ఉత్పాదన పెరిగేందుకు నదుల అనుసంధానం దోహదపడుతుంది. దేశ అవసరాలకు తగిన స్థాయిలో ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పాదన వేగం పుంజుకోలేదు. జల విద్యుత్ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఉత్పాదన 22 వేల మెగావాట్లు మాత్రమే. విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను మరింత మెరుగైన రీతిలో పనిచేసేలా చేయడానికి థర్మల్ విద్యుత్తు, జల విద్యుత్తు నిష్పత్తి 60:40 నిష్పత్తిలో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. మన దేశంలో ఇది ప్రస్తుతం 75:25 నిష్పత్తిలో ఉంది. నదుల అనుసంధానం ద్వారా నిర్మించే డ్యామ్‌ల కారణంగా ఈ పరిస్థితి మారిపోనుంది. జల విద్యుత్ ఉత్పాదన గణనీయంగా మెరుగుపడుతుంది. నదుల అనుసంధానం ద్వారా సమకూరుతుందని భావిస్తున్న జల విద్యుత్ ఉత్పాదన 34 వేల మెగావాట్లుగా ఉండగలదని భావిస్తున్నారు.

దేశంలోని అనేక మహా నగరాలు, ఇతర పట్టణాలు ఇప్పటికే నీటి కొరతతో సతమతమవుతున్నాయి. అనేక మెట్రోపాలిటన్ నగరాలు వాటి డొమెస్టిక్, ఇండస్ట్రియల్ నీటి అవసరాల కోసం సుదూర ప్రాంతాల నుంచి జలాల తరలింపుపై ఆధార పడి ఉన్నాయి. ఢిల్లీ తన నీటి సరఫరాలో కొంత భాగం కోసం గంగా, సట్లెజ్ నదులపై ఆధారపడుతోంది. ముంబై నగరం తన నీటి అవసరాలకోసం వంద కిలోమీటర్ల దూరంలోని వైతమ, బత్సాయి నదులపై ఆధారపడుతోంది. చెన్నయ్ నగరం తన నీటి అవసరాల కోసం తెలుగుగంగ ప్రాజెక్టుపై ఆధారపడుతోంది. దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం నుంచి తెలుగు గంగ కాలువ ద్వారా చెన్నయ్ నగరానికి నీరు సరఫరా అవుతోంది. భవిష్యత్తులో ఆయా మహా నగరాల నీటి అవసరాలు మరింత పెరగడం ఖాయం. ఇందుకోసం అవి సుదూరంలో ఉన్న నదుల నుంచి నీటిని తరలించుకోవాల్సిన దుస్థితి తప్పదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు, ఇతర అనేక గ్రామాలు, నివాస ప్రాంతాలకు లింకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు గల అవకాశాలపై అధ్యయనం జరుగుతోంది. నదుల అనుసంధానం ఇందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు.

అభ్యంతరాలివీ....
నదుల అనుసంధాన ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రధానంగా పర్యాపరణ, ముంపు, భూసేకరణ పరంగా అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై అనేకమంది కోర్టులను ఆశ్రయించారు. ఇదే సమయంలో అంతర్రాష్ర్ట నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, లభ్యమయ్యే నీరు, వాటాలు, వినియోగంలో రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు నెలకొని ఉండడం గమనార్హం. నదుల అనుసంధానం వల్ల ఒక ప్రాంతానికి మేలు జరుగుతుందని, మరో ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న భయాం దోళనలు కూడా వ్యక్తమయ్యాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ నడిచింది. ప్రాజెక్టుకు అను కూలంగా, వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. దీనికితోడు ప్రభుత్వ ఖజానాపై పెను ఆర్థిక భారాన్ని వెూపుతుందని కనుక భావించినట్లయితే.. అను సంధాన ప్రతి పాదనను విరమించు కోవచ్చని గతంలో నదుల అనుసంధాన ప్రక్రియ విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం.. తదనంతర పర్యవసానాలతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది.

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
దేశంలోని నదుల అనుసంధానానికి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు ప్రణాళికా రచన, అమలుకోసం ఒక ఉన్నతస్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్.జె.కపాడియా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఫిబ్రవరి 27న తీర్పు చెప్పింది. నదుల అనుసంధాన ప్రాజెక్టు ప్రగతిపై ధర్మాసనం విచారించింది. దేశానికి ఎంతో ప్రయోజనకరమైన ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టును నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అత్యంత ప్రయోజన కరమైన ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టును సమర్థంగా అమలు చేసే ప్రక్రియలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని ధర్మాసనం సూచించింది. ఈ ప్రాజెక్టు అమలులో ఇప్పటికే జాప్యం జరిగిందని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగి పోయిందని అభిప్రాయ పడింది. నదుల అనుసంధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఇది జాతి హితానికి సంబంధించినది. దీనిని కేంద్రం లేదా రాష్ట్రాలు వ్యతిరేకించడం వెనుక సహేతుక కారణాలు కనిపించడం లేదు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలి అని ధర్మాసనం అభిప్రాయపడింది.

కమిటీలోని సభ్యులు వీరే..
కమిటీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, కార్యదర్శి, అటవీ.. పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రణాళికా సంఘం, జల వనరులు, ఆర్థిక, అటవీ మంత్రిత్వశాఖలు నియమించే నలుగురు నిపుణులు ఉండాలని కోర్టు సూచించింది.

Post a Comment

Previous Post Next Post