ప్రత్యేక హోదా వలన లాభమా, నష్టమా?
రాష్ట్ర విభజన సమయంలో కీలకమైన హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ప్రత్యేక హోదా కల్పించడం. అప్పటి ప్రజలందరూ సమైక్యంగా ఉండాలంటూ ఉద్యమాలను
చేస్తూ కళ్లు మూసుకుపోయి ఉన్న సందర్భంలో కళ్లు తెరిచి, ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలంటూ రాజ్యసభలో గొంతెత్తి సాధించిన వెంకయ్యనాయుడు
గారు, వచ్చేది మేమే ఇచ్చేది మేమేనంటూ ప్రకటించిన
బి.జె.పి ప్రభుత్వం ఇప్పుడు కాదంటున్నాయి. ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా సాయం
అందిస్తున్నామంటూ ప్రసంగాలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అసలు ఇంతకూ ప్రత్యేక
హోదా వలన లాభముందా? ప్రత్యేక హోదా రాకపోతే ఏమి నష్టపోతాము? ఒక విశ్లేషణ నా శైలిలో. . .
ఆర్ధికంగా వెనుకబడిన, భౌగోళికంగా ప్రతికూలతలు
కలిగిన, ఆదాయం కంటే దేశ, రాష్ట్ర రక్షణకై నిధులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన రాష్ట్రాలకు
ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నమే ప్రత్యేక హోదా. సాధారణంగా
ప్రత్యేక హోదా (ఇప్పటికే ఇచ్చిన బహుశా 11 అనుకుంటా, రాష్ట్రాలను గమనిస్తే) కొండప్రాంతాలు,
కనీస సదుపాయాలు, భౌతిక ప్రతికూలతలు కలిగిన రాష్ట్రములకు, దేశ సరిహద్దును కలిగి ఉండి సైన్యం, రక్షణ సంబంధిత అవసరాలకు ఎక్కువగా నిధులను ఖర్చు చేస్తున్న
రాష్ట్రములకు ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగినది. ప్రత్యేక హోదా నిబంధనలలో
ఆర్ధికంగా వెనుకబడిన రాష్ట్రములకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వవచ్చునని ఉన్న
కారణంగా, మన రాష్ట్రమునకు విభజన సమయంలో ప్రత్యేక
హోదా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ప్రస్తుత మన రాష్ట్ర ఆదాయ వ్యయాలను
విశ్లేషిస్తే వచ్చే ఐదేళ్లవరకూ లోటు బడ్జెట్‌తో నడవాల్సిన పరిస్థితిలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. అంటే ఆర్ధికంగా వెనుకబడిన ప్రాంతం అనే నిబంధనను
అనుసరిస్తూ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు అందించవచ్చు.
కల్పించే ప్రత్యేకతలు
కేంద్రప్రభుత్వం అభివృద్ధికై ఇచ్చే ఋణాలు, నిధులలో సహజంగా సాధారణ రాష్ట్రములు తిరిగి చెల్లించాల్సి
ఉంటుంది. అయితే ప్రత్యేక హోదాను కలిగి ఉండే రాష్ట్రములు అలా వచ్చే నిధులల 90% తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన 10% నిధులను మాత్రం తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడివరకే పరిశీలిస్తే
నిజానికి ఇదేమంత ఎక్కువ నిధులు తెచ్చిపెట్టే వెసులుబాటేమీ కాదు. కేంద్రప్రభుత్వం
ఇటీవల నీతి ఆయోగ్ పేరుతో, కేంద్రం నుంచి రాష్ట్రములకు వచ్చే
నిధులను పెంచడంతో ఈ హోదావలన వచ్చే అదనపు ప్రయోజనము దాదాపు నామమాత్రమే
అనేలా ఉన్నది.
అయితే ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన హామీలలో మరొకటి వెనుకబడిన
(బహుశా ఏడు జిల్లాలకు అనుకుంటా) జిల్లాలకు ప్రత్యేక పన్ను రాయితీ, పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం. పూర్తిగా అవగాహన
చేసుకుంటే ఈ వరం యొక్క ప్రయోజనాలు మనకు అవగతం అవుతాయి. ప్రత్యేక హోదా
సంజీవని కాదంటూ కరివేపాకులా తీసిపారేసేవాళ్లు ఆలోచించాల్సిన విషయమిదే. ఒక్కసారి
ఈ పన్ను రాయితీల వలన ప్రయోజనాలను విశ్లేషించుకుందాం. . .
పన్ను రాయితీలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం
అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు గొప్పవరం అని ఎందుకన్నానో ఆలోచిద్దాము. సహజంగా
కొత్తగా పరిశ్రమను స్థాపించాలనుకునే వారికి ఇటువంటి పన్నురాయితీలు చక్కని
ఆకర్షణ వనరు. ఉదాహరణకు ఒక వస్తు ఉత్పత్తి పరిశ్రమ వస్తువును ఉత్పత్తి
చేయడానికి ఒక 8,000 రూపాయిలు ఖర్చు అవుతుందనుకుందాం. సహజంగా
విధించే పన్ను 14% వంతున లెక్కవేస్తే దాదాపు 1120 రూపాయిలు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే 9120 రూపాయిలపైన లాభాన్ని వేసుకుని 10,000 రూపాయిలకు ఆ వస్తువును ఆ పరిశ్రమ అమ్మకానికి పెడుతుంది. అదే
ప్రత్యేక హోదాకు అనుబంధంగా మన రాష్ట్రమునకు ఇస్తామన్నపన్ను రాయితీలు అమలులోకి
వస్తే ఆ పరిశ్రమ తయారీకి అయిన ఖర్చు 8000, లాభం, 880 (పైన ఉదాహరణకు అనుగుణంగా) తో కలుపుకుని
9000 లకే లభించే అవకాశం కలుగుతుంది. అయితే పరిశ్రమ
వస్తు రేటును తగ్గించకుండా పదివేలకే అమ్ముతూ లాభాన్ని తన జేబులో
వేసుకుంటుంది. దీనివలన పరిశ్రమ నిర్మాణానికి పట్టిన పెట్టుబడి త్వరగా
తిరిగి వచ్చేస్తుంది. ఆపై లాభాలను ఆర్జించగలుగుతుంది.
అంటే పన్ను రాయితీ లేని ప్రాంతంలో పెట్టిన పరిశ్రమ ఐదు సంవత్సరాలలో
లాభాల బాట పడుతుందనుకుంటే పన్ను రాయితీలు ఉన్న ప్రాంతంలో పెట్టిన పరిశ్రమ కేవలం
రెండు సంవత్సరాలలోనే లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది.
మరి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు కలిగిన రాష్ట్రములు ఎందుకు అభివృద్ధిలో ముందువరుసలో
లేవు?
ఇదే కీలకమైన అంశం. గతంలో పన్ను రాయితీలు కలిగిన ప్రాంతాలన్నీ
అయితే కొండ ప్రాంతాలు, లేదంటే సరిహద్దు ప్రాంతాలు. కనీసం
వెయ్యి ఎకరాలు చదునైన భూభాగం లేని ఆయా ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు ఎన్ని
రాయితీలు ఇచ్చినా పరిశ్రమలను స్థాపించడం సాధ్యం కాదు. అలాగే కొండ ప్రాంతాలు
కావడం వలన సరైన రోడ్డు, రైలు, నౌకా మార్గాలు లేకపోవడం మరో పెద్ద సమస్య. అందువలననే ప్రత్యేక
హోదా కలిగిన ప్రాంతాలు అభివృద్ధిలో ముందువరుసలలో లేవు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్థావిస్థాను. ప్రాక్టికల్‌గా
గుర్తించండి. ఇప్పటికే ప్రత్యేక హోదా, పన్ను రాయితీలను
కలిగి ఉన్న రాష్ట్రములలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం దాదాపు సాపేక్షంగా మరీ
ఎక్కువ కొండప్రాంతాలు లేని భూభాగాల్నికలిగి ఉన్నది. అందుకే ఎక్కువ పరిశ్రమలు
అక్కడ కేంద్రీకృతం అయినవి. ఇప్పుడు మీ ఇంటిలోని కొన్ని సాధారణ వస్తువులు
చూడండి సబ్బులు, పేస్టులు నుంచి కొద్ది పెద్ద వస్తువుల
వరకూ గమనించండి. మన ఇంటిలో వాడే చాలా వరకూ వస్తువులను గమనిస్తే అవన్నీ
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ల నుంచి తయారైనట్లు మనం
గమనించవచ్చు.
కొద్ది అనుకూలత ఉన్న భూభాగానికే ఇంటిలోని 50 శాతం వస్తువులు అక్కడ తయారవుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పన్నురాయితీ ప్రకటిస్తామని చెప్పిన
ఏడు జిల్లాలు భౌగోళికంగా చక్కని ప్రాంతాలే. చక్కని భూభాగంతో పాటు పరిశ్రమల
స్థాపనకు అవసరం అయిన నీటి పారుదల వసతులు, మిగులు విద్యుత్, రహదారుల కనెక్టివిటీ, పోర్టుల కనెక్టివిటీ, నేరుగా విదేశాలకు
ఎగుమతి చేసే సౌకర్యము, ముడి సరుకులు నేరుగా దిగుమతి చేసుకోగల
నౌకాశ్రయాలు, అన్నింటినీ మించి ఆశగా ఎదురు
చూస్తున్న నిరుద్యోగులు (అంతటా ఉన్నారనుకోండి), స్కిల్‌తో పని చేయగల నేర్పరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక
హోదా పన్ను రాయితీ కల్పిస్తే ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఊహించండి
మిత్రమా. . .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టూ గమనిస్తే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి అభివృద్ధి చెందిన నగరాలు
ఉన్నాయి. వీటన్నింటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 200 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అంటే
మిగులు విద్యుత్ ఉన్నా, భౌతిక వసతులు ఉన్నా, ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు లేకుంటే మన ఆంధ్రప్రదేశ్‌లో
పరిశ్రమ స్థాపన కంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆయా నగరాలలో స్థాపనే మంచిదనే
అభిప్రాయంతో ఆయా నగరాలలోనే కొత్త పరిశ్రమలను స్థాపించే అవకాశం ఉంది. అంటే
మన రాష్ట్రం మరింతగా లోటు బడ్జెట్‌తో గడపాల్సిన పరిస్థితిలోనే నడుస్తుంది.
చుట్టు ఉన్న ఈ మెగా నగరాలతో పోటీ పడాలంటే ( అభివృద్ధికి కాకున్నా కనీసం బ్రతకడానికైనా
పోటీ తప్పదు కదా) ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు
తప్పనిసరి.
మరి ఎందుకు రావడం లేదు?
కేవలం మేధావి వర్గం నిశబ్దంగా ఉండడం వలననే.
రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి.
ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం ఇందాక ఉదహరించిన నగరాలను కలిగి ఉన్న
రాష్ట్రముల ముఖ్యమంత్రుల ఒత్తిడిలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇవ్వకపోతే ఒక్క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒత్తిడి మాత్రమే. అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మిత్రులం
న్యాయం చేయండంటే చేస్తారని కలసి వెళ్లింది. ఇప్పుడు ఏమీ పాలుపోని పరిస్థితిలో
నిలిచింది. నిజానికి ధైర్యం చేసి, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని
భావించి పోరాడాల్సిన సమయంలో నోరుమెదపకుండా ఉన్నది. మరి ఇంకెవరు దీనికి పరిష్కారం
చూపించేది?
ఏ ఆలోచన లేకుండా రాష్ట్రం విడిపోతుందని తెలిసిన (బయటకు మాత్రం
వ్యక్తం చేయకుండా) తరువాత కూడా సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన
మన మేధావి వర్గం (ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలు) అసలైన ఉద్యమాన్ని ఇప్పుడు ప్రారంభించాలి. గతంలో సమైక్యాంధ్రపేరుతో
వృధా ఉద్యమం చేసిన మనం ఇప్పుడు మనకు రాజ్యాంగబద్దంగా, పార్లమెంటు సాక్షిగా, రాజ్యసభ
సాక్షిగా రావలసిన
హామీలను సాధించుకోవడానికి ఉద్యమం ప్రారంభించాలి. నిజానికి ఇదే మనం
చేయాల్సిన అసలైన ఉద్యమం. ఆవిషయాన్ని గుర్తించాలి. మనం ఎప్పుడైతే ఉద్యమానికి
పిలుపునిస్తామో, కొద్ది రోజులకు ప్రజలకు ప్రత్యేక
హోదా, రాయితీలను గురించి తెలిసే అవకాశం
ఉంటుంది. అప్పుడు మన ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఆ సాకుతో రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం జరుగుతుంది. ఆపై మనకు ప్రత్యేక హోదా, ఇతర రాయితీలు లభించే అవకాశం ఉన్నది.
మిత్రమా,
గత ఉద్యమం వృధా అయినా చక్కని
స్పూర్థి నింపింది మనలో.
నిజమైన సమయంలో ఉద్యమానికి వెనుకడుగు
వేసి భవిష్యత్ తరాలను చీకటిలోకి నెట్టకు.
తెలుసుకో . . . తెలియజెప్పు . . .
సాధించడానికి మార్గం ఆలోచించు.
మీ
చైతన్య కుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఫోన్ 9441687174
చూడండి
http://menavachaitanyam.blogspot.com