పోస్టులతో కొత్త సంవత్సరంలోకి ఆర్ఆర్‌బీ స్వాగతం!
- వీటిలో 5942 అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, 7591 గూడ్స్ గార్డులు
- అన్ని పోస్టులకూ అర్హత డిగ్రీ
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక
- ఏక పరీక్ష ద్వారా ఎంపిక
- ప్రతి జిల్లాలోనూ పరీక్ష కేంద్రం
డిగ్రీ పూర్తిచేసిన, రైల్వే ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..వివిధ జోన్‌ల్లో ఆర్ఆర్‌బీ 18252 పోస్టుల భర్తీకి మెగా నోటిపికేషన్ విడుదలచేసింది. ఈ పోస్టులన్నింటికీ అర్హత డిగ్రీ కావడం విశేషం. అలాగే ఈసారి కేవలం ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. ఇంతకుముందు ఉన్నట్టు స్టేజ్-2 పరీక్ష మరిలేదు. కాబట్టి అభ్యర్థులు అదనంగా మళ్లీ చదవాల్సిన అవసరం లేదు. అలాగే ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ కూడా తప్పినట్టే. డిగ్రీ అర్హతతో నిర్వహించే ఏఎస్ఎం, గూడ్స్‌గార్డు లాంటి ఉద్యోగాలకు ఒకే స్రకటన ద్వారా ఇన్ని పోస్టులను భర్తీచేయడం ఇదే మొదటిసారి. ప్రకటన వెలువడిన ఉద్యోగాలన్నీ నాన్ టెక్నికల్ కేడర్‌లో ముఖ్యమైనవే. కమర్షియల్ అప్రెంటిస్ (సీఏ), ట్రాఫిక్ అప్రెంటిస్(టీఏ), ఎంక్వైరీ కం రిజర్వేషన్ క్లర్క్(ఈసీఆర్‌సీ), గూడ్స్ గార్డు, సీనియర్ క్లర్క్ కం టైపిస్టు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ (జేఏఏ), అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్(ఏఎస్ఎం), ట్రాఫిక్ అసిస్టెంట్, సీనియర్ టైమ్ కీపర్ ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 25, 2016
పరీక్షలు: 2016లో మార్చి-మే మధ్యలో వివిధ తేదీల్లో నిర్వహిస్తారు.
విద్యార్హత: ఏదైనా డిగ్రీ. కొన్ని పోస్టులకు టైపింగ్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా 32 ఏళ్లు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. వీటి ప్రకారం అన్ రిజర్వ్‌డ్ అభ్యర్థులైతే జనవరి 2, 1984 తర్వాత జన్మించి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు జనవరి 2, 1981 తర్వాత; ఎస్సీ, ఎస్టీలు జనవరి 2, 1979 తర్వాత జన్మించాలి. ఏ కేటగిరీకి చెందినవాళ్లైనప్పటికీ జనవరి 1, 1998 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మైనారిటీలు, పీహెచ్ అభ్యర్థులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారు(రూ.50,000 కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న తల్లిదండ్రుల పిల్లలు) పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు. ఓబీసీ, జనరల్ పురుష అభ్యర్థులు పరీక్ష పీజుగా రూ.వంద చెల్లిస్తే సరిపోతుంది. ఈ పోస్టులన్నింటికీ ఒకే ఉమ్మడి పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదు. అభ్యర్థులు ప్రాథాన్యతను అనుసరించి అయిదు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు వాటిలో ఏదో ఒక పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. అలాగే ఏ పోస్టు, జోన్‌కి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుపుకోవచ్చు. బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, సికింద్రాబాద్ జోన్‌ల పరిధిలో పరీక్షలు రాసేవారు తెలుగు మాధ్యమంలో రూపొందించిన ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు. అన్వయదోషాలు, అచ్చుతప్పులు ఉంటే ఇంగ్లిష్ మాధ్యమంలో ఉన్న ప్రశ్నలను పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఏవైనా సందేహాలు ఉంటే ఆంగ్లంలో ఆ ప్రశ్నను పరిశీలించుకోవడం తప్పనిసరి.
పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌లో: అమలాపురం, అనంతపూర్, భీమవరం, చెల్లపల్లి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూటి, గుడివాడ, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచెర్ల, కావలి, కర్నూలు, నంద్యాల, నరసాపురం, నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుత్తూరు, రాజమండ్రి, రాజాం, రాజంపేట, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, టెక్కలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నల్లొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్దిపేట, వరంగల్.
పరీక్ష ఇలా...
బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలడుగుతారు. జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. మొత్తం వంద ప్రశ్నలడుగుతారు. పరీక్ష వ్యవధి గంటన్నర. ప్రతి తప్పు సమాధానానికీ మూడోవంతు మార్కు చొప్పున తగ్గిస్తారు.
నియామకాలిలా...
అభ్యర్థులు అందరికీ ఉమ్మడిగా కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తారు. కమర్షియల్ అప్రెంటిస్, ట్రాపిక్ అప్రెంటిస్, ఎంక్వైరీ కం రిజర్వేషన్ క్లర్క్, గూడ్స్‌గార్డు పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్టు అనంతరం సర్టిఫికెట్లు పరిశీలించి పోస్టింగు కేటాయిస్తారు. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ పోస్టులకు టైపింగ్ టెస్టు అదనంగా ఉంటుంది. ఏఎస్ఎం, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఆప్టిట్యూడ్ టెస్టు అదనంగా నిర్వహిస్తారు.
Tags
JA