పదవ తరగతి విద్యార్ధులలో బాగా చదివే విద్యార్ధుల మధ్య స్నేహపూర్వక పోటీని పెంచడానికి నేను ఎంచుకునే వ్యూహం స్వీయ మూల్యాంకన వ్యూహం. దీనిలో భాగంగా విద్యార్ధులకు ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన జాబితాను (4, 2 మార్కుల ప్రశ్నలు, పటాలు) అందిస్తాను. ఒక చార్ట్‌పై ప్రశ్నల సంఖ్య, దానికి ఎదురుగా విద్యార్ధులందరి క్రమ సంఖ్యలతో కూడిన ఒక పట్టికను రూపొందించి తరగతి గదిలో వేలాడదీస్తాను. విద్యార్ధులు తమ ఇష్టానికి అనుగుణంగా ఆ జాబితాలోని ప్రశ్నలు చదువుకుని, ఆ ప్రశ్న సరిగా వచ్చింది అనుకున్న తరువాత, ఆ ప్రశ్నకు ఎదురుగా, వారి క్రమ సంఖ్య గల గడిలో ఒక స్టార్ గుర్తును ఉంచాలి. అలా స్టార్‌లు పెరిగే కొలదీ వారికి వచ్చిన ప్రశ్నల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక పోటీ విషయానికి వస్తే బాగా చదివే విద్యార్ధులలో ఒకరికి స్టార్‌లు ఎక్కువగా ఉన్నట్లయితే, మిగిలిన వారు వారిని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఇంటివద్ద మరికొంచె ఎక్కువ సమయం మనం చెప్పకుండానే మన సబ్జక్టును ఇష్టంగా చదవడం మొదలు పెడతారు. అలా ఒకరికంటే మరొకరు ఎక్కువ స్టార్‌లు సాధించటం కోసం ప్రయత్నిస్తూ స్నేహపూర్వక పోటీతో చదివే అవకాశం ఉంటుంది. మనం విద్యార్ధులు ఒక క్రమ పద్దతిలో చదువుతున్నారా లేదా పరిశీలించుకుంటూ, వారానికి ఒకసారి వారు చదివిన ప్రశ్నల జాబితాను పరిశీలించి అందులోని ప్రశ్నలతో పరీక్షలను నిర్వహిస్తు ఉంటే సరిపోతుంది. అలాగే విద్యార్ధులు రాని ప్రశ్నలను కూడా వచ్చినట్లు భావించేసి, స్టార్‌లు పెట్టడాన్ని నియంత్రిస్తే సరిపోతుంది. విద్యార్ధులు తమంతట తామే ఇష్టపూర్వకంగా, పోటీతత్వంతో ప్రిపేర్ అయ్యే అవకాశం, ఎంతవరకూ చదువుతున్నామో వారికి వారే విశ్లేషించుకునే అవకాశం ఈ వ్యూహంలో ఉన్నందున దీన్ని నేను స్వీయ మూల్యాంకనా వ్యూహంగా వ్యవహరిస్తున్నాను.
ఈ స్వీయ మూల్యంకనా వ్యూహానికి అవసరం అయిన ప్రశ్నల జాబితాను, పట్టికలను క్రింది లింక్ ద్వారా మీరూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉపయుక్తంగా ఉందని భావిస్తే అమలు పరచవచ్చు.
bit.ly/XNCPSSET
మీ
చైతన్య కుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్